Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎమోష‌న్‌కు గురైన మాట వాస్త‌వ‌మే కానీ... : మేక‌తోటి సుచ‌రిత

meakthoti sucharitha comments on her resignation
  • రాజీనామా అవాస్త‌వ‌మ‌న్న సుచరిత‌
  • థ్యాంక్స్ గివింగ్ లెట‌ర్‌ను కుమార్తె త‌ప్పుగా అర్థం చేసుకుంద‌ని వెల్ల‌డి
  • రాజీనామా స‌మ‌స్యే లేద‌న్న మాజీ హోం మంత్రి
  • తాడేప‌ల్లిలో సీఎం జ‌గ‌న్‌తో గంట‌న్న‌రకు పైగా భేటీ
ఏపీ మంత్రివ‌ర్గ పున‌ర్వ్యవ‌స్థీక‌ర‌ణ నేప‌థ్యంలో అల‌క‌బూనిన రాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి మేక‌తోటి సుచ‌రిత కాసేప‌టి క్రితం అల‌క వీడారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యానికి వ‌చ్చిన ఆమె సీఎం జ‌గ‌న్‌తో గంట‌న్న‌ర‌కు పైగా భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత ఆమె అక్క‌డే మీడియాతో మాట్లాడారు. త‌న అల‌క‌, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా అంటూ జ‌రిగిన ప్ర‌చారంపై ఆమె స్పందించారు.

ఈ సంద‌ర్భంగా ఆమె ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంత్రివర్గ పున‌ర్వ్యవ‌స్థీక‌ర‌ణ‌లో ప‌ద‌విని ఆశించిన నేప‌థ్యంలో ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో చిన్నపాటి ఎమోష‌న్‌కు గురైన మాట వాస్త‌వ‌మేన‌ని ఆమె చెప్పారు. మంత్రివ‌ర్గ పున‌ర్వ్యవ‌స్థీక‌ర‌ణ సంద‌ర్భంగా థ్యాంక్స్ గివింగ్ లెట‌ర్ రాశాన‌ని, దానినే త‌న కుమార్తె త‌ప్పుగా అర్థం చేసుకుని ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్టుగా చెప్పింద‌ని పేర్కొన్నారు. రాజీనామా అన్న ప్ర‌శ్నే ఉత్ప‌న్నం కాలేద‌ని ఆమె చెప్పుకొచ్చారు.

రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల్సి వ‌స్తే.. వైసీపీ కార్య‌క‌ర్త‌గానే కొన‌సాగుతాన‌ని సుచరిత చెప్పుకొచ్చారు. త‌న‌ను సీఎం జ‌గ‌న్ త‌న కుటుంబంలోని వ్య‌క్తిగా ప‌రిగ‌ణిస్తార‌ని ఆమె చెప్పారు. జ‌గ‌న్ నిర్ణ‌యానికి తాను క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని కూడా సుచ‌రిత చెప్పారు. కొంత‌కాలంగా అనారోగ్యం నేప‌థ్యంలో బ‌య‌ట‌కు రాలేక‌పోయాన‌ని కూడా ఆమె చెప్పారు.
YSRCP
Mekathoti Sucharitha
YS Jagan

More Telugu News